Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముష్కరులు ఎక్కడ నుంచి వచ్చారు? అటాక్ ఎలా జరిగింది?

పంజాబ్ లోని దీనానగర్ పోలీస్ స్టేషన్ పై విరుచుకుపడ్డ ముష్కరులు పాకిస్థాన్ లోని నరోవాల్ నుంచి వచ్చినట్టు ఇంటలిజెన్స్ బ్యూరో వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడికి ముందు వారి కదలికలను జమ్ములోని హరినగర్ లో గుర్తించినట్టు సమాచారం. హరినగర్ నుంచి అమృత్ సర్-పఠాన్ కోట్ హైవే వద్దకు రాత్రి చేరుకున్న ఉగ్రవాదులు తొలుత ఓ కారును హైజాక్ చేశారు. అనంతరం అదే రహదారిపై వెళుతున్న ఓ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు వదిలాడు. అక్కడ నుంచి నేరుగా దీనానగర్ చేరుకుని అక్కడి పోలీస్ స్టేషన్ పై కాల్పులకు తెగబడ్డారు. తొలుత గార్డును చంపి, పీఎస్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పీఎస్ లోని పోలీసులను, లాకప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపి... పోలీస్ స్టేషన్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఘటనా స్థలానికి పంజాబ్ పోలీసులతో పాటు భారీ ఎత్తున సైన్యం చేరుకుంది. సైన్యం జరుపుతున్న కాల్పుల్లో ఇప్పటికే ఒక ఉగ్రవాది మరణించినట్టు సమాచారం. మొత్తం నలుగురి నుంచి 10 మంది వరకు ముష్కరులు దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులే అని భద్రతా దళాలు తెలిపాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

More Telugu News